బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము ₹1.84 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు వంటి విభాగాల్లో ప్రజలకు చెందాల్సిన కానీ ఇప్పటివరకు క్లెయిమ్ చేయని సొమ్ము భారీగా పేరుకుపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము మొత్తం ₹1.84 లక్షల కోట్లకు చేరిందని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో “మీ సొమ్ము – మీ హక్కు” అనే పేరుతో మూడు నెలలపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తామే అర్హులు అయినా తమ పేర్లపై ఉన్న సొమ్మును క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. బ్యాంక్ డిపాజిట్లు, బీమా పాలసీలు, ప్రావిడెంట్ ఫండ్, షేర్‌లు వంటి విభాగాల్లో ఈ అన్ క్లెయిమ్ నగదు ఉందని మంత్రి వివరించారు. ఈ మొత్తాన్ని అర్హులైన వారికి అందించేందుకు అధికారులు మూడు నెలల్లో అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన పత్రాలు సమర్పించి తమ డబ్బు తిరిగి పొందాలని ఆమె పౌరులను కోరారు. ఈ సొమ్ముకు ప్రభుత్వం కస్టోడియన్‌గా వ్యవహరిస్తోందని ఆమె స్పష్టం చేశారు. క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ పేర్లపై ఉన్న డిపాజిట్లు లేదా ఇతర ఖాతాల వివరాలను తెలుసుకుని అవసరమైన పత్రాలు సమర్పించి డబ్బు పొందవచ్చని తెలిపారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకులు ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుండాలని కోరారు. అవసరమైతే గ్రామాల్లోనూ బ్యాంకులు ప్రచారం నిర్వహించి, ఎవరికి ఎక్కడ సొమ్ము ఉందో వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రతి పౌరుడూ తన సొమ్ము గురించి అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వం ఈ సొమ్మును భద్రంగా ఉంచుతుందని, సరైన హక్కుదారులకు మాత్రమే అందజేస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

తాజా వార్తలు చదవండి :