క్రెబ్స్ కెమికల్స్ కంపెనీ కాలుష్యంపై ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన ఫిర్యాదు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) కి ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ మొదలైంది. నిబంధనల ప్రకారం పరిశీలించిన PCB అధికారులు కంపెనీకి నోటీసులు జారీ చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చర్యలు ప్రారంభమైన తర్వాత బొండా ఉమా స్వయంగా అధికారులను ఒత్తిడి చేస్తూ “నోటీసులు వెనక్కి తీసుకోండి, చర్యలు తీసుకోవద్దు” అని కోరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తానే ఫిర్యాదు చేసి, తర్వాత వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. PCB అధికారులు మాత్రం స్పష్టంగా “మేము నిబంధనల ప్రకారం మాత్రమే పని చేస్తాము. ఇచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేసి అవసరమైతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము” అని తెలిపారు. అధికారులు వినకపోతే, బొండా ఉమా తెరవెనుక ఒత్తిడి బయటపడుతుందనే భయం ఆయనకు కలిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీకి చెందిన రాంకీ సంస్థ పేరును కూడా లాగడం మరో వివాదానికి కారణమైంది. ఇలాంటి పరిణామాల వెనుక అసలు నిజం ఏమిటన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. ఇక ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. శాఖల్లో చిన్న తప్పు కూడా సహించని ఆయన, వెంటనే ఈ ఆరోపణలపై విచారణ జరిపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. “ఆకాశం మీద ఉమ్మితే మొఖం మీద పడుతుంది” అన్న సామెతను తలపించేలా బొండా ఉమా వ్యవహారం మారిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత పెద్ద రాజకీయ చర్చకు దారితీయడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.



