టీమిండియా కెప్టెన్సీలో సంచలన మార్పు – రోహిత్ స్థానంలో గిల్‌కు అవకాశం

భారత క్రికెట్‌లో మరోసారి కెప్టెన్సీ మార్పు సంచలనంగా మారింది. భారత జట్టుకు ఎన్నో గుర్తుండిపోయే విజయాలు అందించిన రోహిత్ శర్మను సెలక్టర్లు పక్కన పెట్టి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయం అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఆయన సారథ్యంలోని జట్టు 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డేల్లో రోహిత్ శర్మకు ఉన్న విజయ శాతం, వ్యూహాత్మక దూకుడు జట్టును అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లింది. అందుకే రోహిత్‌నే 2027 ప్రపంచకప్ వరకు వన్డే సారథ్య బాధ్యతలు కొనసాగిస్తారని అందరూ ఊహించారు. కానీ, సెలక్షన్ కమిటీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ గిల్‌కు నాయకత్వం అప్పగించడం షాక్‌గా మారింది.

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “తన సేవలకు ఇది సముచిత గౌరవం కాదు” అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం దీన్ని వ్యూహాత్మక నిర్ణయంగా చూస్తోంది. రాబోయే సంవత్సరాల్లో టెస్ట్‌, వన్డే, టీ–20 మూడు ఫార్మాట్లకీ ఒకే కెప్టెన్ ఉండటం టీమ్ కల్చర్‌కు మేలు చేస్తుందని భావిస్తోంది. ఒక్కో ఫార్మాట్‌కు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల జట్టులో ఏకత క్షీణిస్తుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల ఫామ్‌ను కాపాడుకోవడం కూడా మేనేజ్‌మెంట్ ప్రధాన లక్ష్యమట. నాయకత్వపు ఒత్తిడి లేకుండా రోహిత్ బ్యాటర్‌గా రాణిస్తే జట్టుకు మరింత ఉపయోగం ఉంటుందని వారు భావిస్తున్నారు. అలాగే 2027 వరకూ ఈ ఇద్దరు సీనియర్లను ఫిట్‌గా ఉంచి వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించేలా చేయాలన్న ఉద్దేశంతో వారికి విశ్రాంతి ఇచ్చే విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద, రోహిత్‌ సారథ్యం నుంచి తప్పించబడటం ఒక యుగానికి ముగింపు లాంటిదే. గిల్‌కి ఇది కొత్త ఆరంభం. కానీ ఈ నిర్ణయం టీమిండియాలో ఎంత ప్రభావం చూపుతుందో, రాబోయే సిరీస్‌లు దానిని నిర్ధారించనున్నాయి.