లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్.. మద్యం అమ్మకాల్లో కఠిన నిబంధనలు తప్పదు

లిక్కర్ షాపుల వద్ద కొత్త రూల్స్.. మద్యం అమ్మకాల్లో కఠిన నిబంధనలు తప్పదు

అమరావతి, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. అరెస్టులు కొనసాగుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్య నిందితుడు జనార్ధన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలు చేయడం కూడా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ షాపులు, బార్ల వద్ద మద్యం అమ్మకాలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ రూల్స్ పాటించకపోతే షాపులు మూసివేయడం వరకు చర్యలు తీసుకుంటారు.

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎక్సైజ్ శాఖ ఇప్పటికే లిక్కర్ షాపు యజమానులు, బార్ల యజమానులకు ఆదేశాలు అందజేసింది. ఇకపై మద్యం బాటిళ్లను ఎలా పడితే అలా అమ్మడానికి వీల్లేదు. మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే అమ్మకాలు జరపాలి. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఈ రూల్ తప్పనిసరి చేశారు. మద్యం బాటిల్ స్కాన్ చేస్తే, అది ఎక్కడ తయారైంది, ఎటు నుంచి ఎటు వచ్చిందనే వివరాలు తెలుస్తాయి. ఈ సమాచారం ఆధారంగా మద్యం అసలైనదా, కల్తీదా అని గుర్తించవచ్చు.

లిక్కర్ షాపులు, బార్లలో “మా వద్ద విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నాణ్యమైనది, నిజమైనదని ధ్రువీకరించాం” అనే బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మద్యం అమ్మకాలు జరిగే ముందు బాటిల్ మీద సీల్, క్యాప్, హోలోగ్రామ్ వంటి అంశాలను పరిశీలించాలి. ప్రతీ లిక్కర్ షాపు, బార్లలో ఓ రిజిస్టర్ నిర్వహించాలి. ఆ రోజు అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్లు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సమయం వంటి వివరాలను ఈ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఎక్సైజ్ సిబ్బంది ర్యాండం తనిఖీలు చేసి, ఆ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

ప్రతి లిక్కర్ షాపు, బార్‌లోని మద్యం బాటిళ్లలో కనీసం 5 శాతం స్కాన్ చేయాలి. ఇది నకిలీ మద్యాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. నకిలీ మద్యం పై ప్రజలు పిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈ వ్యవస్థలో ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో లేదా హెల్ప్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ రూల్స్ అమలు చేయడంతో మద్యం అమ్మకాలు మరింత పారదర్శకంగా మారతాయని, కల్తీ మద్యం సమస్య తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమైంది. వైసీపీ నేతలు “టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది” అని విమర్శిస్తుండగా, టీడీపీ నేతలు “వైసీపీ హయాంలోనే కల్తీ మద్యం పెరిగింది” అని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ మీద నిందితుడు జనార్ధన్ రావు ఆరోపణలు చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, దర్యాప్తు వేగవంతం చేసింది. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా’ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, తయారీ వివరాలు, రవాణా సమాచారం తెలుస్తుంది. ఈ యాప్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంది, దీనితో మద్యం నిజమైనదా కాదా తనిఖీ చేసుకోవచ్చు.

ఈ కొత్త రూల్స్ మద్యం విక్రయాలను క్రమబద్ధం చేస్తాయని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయని విశ్లేషకులు అంటున్నారు. లిక్కర్ షాపు యజమానులు ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఈ రూల్స్ అమలుకు ఎక్సైజ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ చర్యలు కల్తీ మద్యం సమస్యను అరికట్టేందుకు సహాయపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

 

తాజా వార్తలు చదవండి :