సమాజంలో వైషమ్యాలు అరికట్టడం అత్యంత అవసరమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. సమాజంలో విభేదాలు రేకెత్తించే కుల ఆధారిత ఫ్లెక్సీలు, సోషల్ మీడియా పోస్టులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సుగాలి ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరగా న్యాయం జరగాలని అన్నారు. సంక్షేమ హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాలికల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద అప్రమత్తత అవసరమని ఆయన గుర్తుచేశారు. శబ్ద కాలుష్యం పెంచే డీజేలు, మైకుల వినియోగంపై కఠిన నియంత్రణలు ఉండాలని, మతపరమైన కార్యక్రమాలు, సినిమా ఫంక్షన్లలో శబ్ద పరిమితులు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
డ్రగ్స్, గంజాయి వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యాసంస్థల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా గొలుసును ధ్వంసం చేస్తే నేరాలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది రోజుల్లో తీవ్ర నేరాల సంఖ్యను 33 శాతం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపట్లనైనా ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, సామాజిక సమైక్యతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది.



