రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు సమూల మార్పులు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రతి పల్లెలో పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీల పునర్వర్గీకరణ, కొత్త విధానాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో 48 ఏళ్ల క్రితం ఉన్న సిబ్బంది నమూనానే కొనసాగుతుండడం వల్ల అభివృద్ధి కష్టమవుతోందని ఆయన గుర్తించారు. ఆర్థిక వెనుకబాటు, లోపభూయిష్టమైన విధానాలు పంచాయతీల పురోగతికి అడ్డంకిగా మారాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీకి అవసరమైన సిబ్బందిని గ్రేడ్ల ఆధారంగా నియమించే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై ఆదాయం మాత్రమే కాకుండా జనాభా, మండల కేంద్రం, గిరిజన ప్రాంతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నారు.
పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పవన్ కళ్యాణ్ పలు సంస్కరణలు ప్రారంభించారు. సర్పంచుల గౌరవాన్ని కాపాడేందుకు జాతీయ పండుగల నిమిత్తం మైనర్ పంచాయతీలకు ఇచ్చే మొత్తాన్ని రూ.100 నుంచి రూ.10,000కు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25,000కు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పారదర్శకంగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసే చర్యలు చేపట్టారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను పరిష్కరించి ఒకేసారి 10 వేల మందికిపైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారు. గ్రామాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు రూర్బన్ పథకాన్ని వినియోగిస్తామని, పంచాయతీల ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జి.ఏ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, కమిషనర్ కృష్ణతేజ, న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, ఒ.ఎస్.డి. వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



